:

1 Corinthians 4

1

ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను.

2

"మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును, నమ్మకమైనవాడై యుండుట అవశ్యము."

3

మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను.

4

"నాయందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే."

5

"కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చువరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగు లోనికి తెచ్చి, హృదయములలోని ఆలోచనలను బయలు పరచునప్పుడు ప్రతివానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును."

6

"సహోదరు లారా, మీరు మమ్మును చూచి లేఖనములయందు వ్రాసి యున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి యొకని మీద ఉప్పొంగ కుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపొల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పియున్నాను."

7

"ఎందుకనగా, నీకు ఆధిక్యము కలుగజేయువాడు ఎవడు? నీకు కలిగిన వాటిలో పరుని వల్ల నీవు పొందనిది ఏది ? పొందియుండియు పొందనట్లు నీవు అతిశయింపనేల ?"

8

"ఇదివరకే మీరేమియు కొదువలేక తృప్తులైతిరి, ఇది వరకే ఐశ్వర్యవంతులైతిరి. మమ్మును విడిచి పెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడ రాజులమగునట్లు, మీరు రాజులగుట నాకు సంతోషమేగదా?"

9

మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపొస్తలులమైన మమ్మును అందరి కంటె కడపట ఉంచియున్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా నున్నాము.

10

"మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. మీరు క్రీస్తు నందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులము."

11

"ఈ ఘడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక యున్నాము."

12

"స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము."

13

"దూషింపబడియు బతిమాలు కొనుచున్నాము. లోకమునకు మురికి గాను, అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడియున్నాము."

14

"మిమ్మును సిగ్గు పరచవలెనని కాదు గాని, నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయుచున్నాను."

15

"క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేలమంది యున్నను, తండ్రీలు అనేకులు లేరు."

16

క్రీస్తుయేసు నందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడచుకొనువారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

17

ఇందునిమిత్తము ప్రభువు నందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తు నందు నేను నడుచుకొను విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును.

18

నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరుప్పొంగుచున్నారు.

19

"ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్నవారి మాటలను కాదు, వారి శక్తినే తెలిసికొందును."

20

దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తి తోనే యున్నది.

21

మీరేది కోరుచున్నారు ? బెత్తముతో నేను మీ యొద్దకు రావలెనా ? ప్రేమతోను సాత్వికమైన మనస్సుతోను రావలెనా ?

Link: